ఎన్నికలు ఎప్పుడూ నిర్వాహించాల్సి వచ్చిన సన్నద్దంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జస్టిస్ కనగరాజ్ అధికారులకు సూచించారు. సోమవారం విజయవాడలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో ఆయన అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వర్తించాలని సిబ్బందికి ఈ సందర్భంగా ఎస్‌ఈసీ దిశానిర్ధేశం చేశారు. దేశంలో, రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని.. అంతా సద్దుమణిగిన తర్వాత ఎన్నికలు నిర్వాహించాల్సి ఉందన్నారు.
సమయానికి అనుగుణంగా కార్యచరణ, ప్రణాళికలు ఉండాలని ఎస్‌ఈసీ అధికారులను ఆదేశించారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనలో పంచాయతీ రాజ్ వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియామవళి కీలక భూమిక పోషిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆ తర్వాత కరోనా కారణంగా ఎన్నికల ప్రక్రియ వాయిదా పడ్డ సంగతులను అధికారులు ఎస్‌ఈసీకి వివరించారు.
కాగా, ఏపీ నూతన ఎన్నికల కమిషనర్‌గా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ శనివారం ఉదయం బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఆయన మద్రాస్ హైకోర్టు జడ్జిగా పనిచేసి.. రిటైర్డ్ అయ్యారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదిస్తూ ఆర్డినెన్స్ తేవడంతో.. ఆ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తన పదవిని కోల్పోయారు. దీంతో ఆయన స్థానంలో జస్టిస్ కనగరాజ్‌ను నియమించారు. ఇవన్నీ కూడా కొన్ని గంటల వ్యవధిలోనే చకచకా జరిగిపోయాయి.