నల్గొండ జిల్లా చండూరులో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నామినేషన్ కార్యక్రమానికి తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, సహ ప్రబారి అరవింద్ మీనన్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు తెలంగాణ భవిష్యత్తును నిర్దేశించబోతుందని అన్నారు.
రాష్ట్రంలోని యువత, ఉద్యోగులు, రైతులు, కార్మికులు, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ పాలనతో తీవ్రంగా నష్టపోయారని అన్నారు. కెసిఆర్ పై ఉన్న కసినంత ఓటు రూపంలో చూపాలని పిలుపునిచ్చారు. ఫామ్ హౌస్ లో పడుకున్న కేసీఆర్ ని లంకెలపల్లి దాకా గుంజుకొచ్చామని అన్నారు. ఈ ఎన్నిక తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించేదన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, రుణమాఫీ జరగాలంటే జనం బిజెపిని గెలిపించాలన్నారు.
ఒక్కో ఓటుకు 40,000 ఇచ్చి మంత్రులను కేసీఆర్ పంపించారని.. టిఆర్ఎస్ ఇచ్చే డబ్బులు తీసుకోండి కానీ.. బిజెపికి ఓటెయ్యాలని అన్నారు. మంత్రులు మందు, చిందులతో మీటింగ్ లు పెడుతున్నారని విమర్శించారు. కెసిఆర్ పాస్ పోర్టుల బ్రోకర్ అని ఆరోపించారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి భారీ మెజారిటీతో గెలవడం ఖాయం అనే ధీమా వ్యక్తం చేశారు.