కోవిడ్ వ్యాక్సిన్ను పంపిణీ చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. అందులో భాగంగానే కేంద్రం ముందుగా ఆరోగ్య సిబ్బందికి, ఇతర ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ను పంపిణీ చేయనుంది. తరువాత 50 ఏళ్లు పైబడిన వారికి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారికి వ్యాక్సిన్ను పంపిణీ చేస్తారు. అయితే వ్యాక్సిన్ ను తీసుకోవాలని ఎవరిపై ఒత్తిడి చేయబోమని, ఎవరికి వారు స్వచ్ఛందంగా వ్యాక్సిన్ను తీసుకోవచ్చని, ఇందులో బలవంతం ఏమీ లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం అనేది వాలంటరీయే, ఇందులో బలవంతం ఏమీ లేదని ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా వ్యాక్సిన్ తీసుకునేందుకు గాను ముందుగా పౌరులు ప్రత్యేకమైన పోర్టల్లో రిజిస్టర్ చేయించుకోవాలి. అందుకు గాను ఆధార్, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వాలు ఇచ్చే గుర్తింపు కార్డులు, ఉద్యోగులు అయితే ఐడీ కార్డులు, ఓటర్ ఐడీలలో దేన్నయినా చూపించి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేందుకు రిజిస్టర్ చేయించుకోవచ్చు.
ఇక రిజిస్టర్ చేసుకున్నవారు వ్యాక్సిన్ తీసుకునేందుకు మొదటి దశలో అర్హులు అయితే వారికి వ్యాక్సిన్ ఇచ్చే తేదీ, సమయం, ప్రదేశం వివరాలను మొబైల్కు ఎస్ఎంఎస్ రూపంలో తెలియజేస్తారు. ఆ రోజు వెళ్లి పౌరులు వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. వ్యాక్సిన్ వేయించుకున్నాక మళ్లీ 28 రోజులకు రెండో డోసు ఇస్తారు. ఆ తరువాతే శరీరంలో యాంటీ బాడీలు వృద్ది చెందుతాయి. దీంతో కోవిడ్ నుంచి రక్షణ లభిస్తుంది. అప్పటి వరకు వ్యాక్సిన్ వేసుకున్న వారు కూడా కచ్చితంగా కోవిడ్ జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. అయితే పలు వ్యాక్సిన్ కంపెనీలు తమ వ్యాక్సిన్లను అత్యవసరంగా వినియోగించేందుకు గాను ఇప్పటికే అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వాటికి అనుమతి రాగానే దేశంలో వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుంది.