క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా చర్చిలు భక్తులతో కోలాహలంగా మారాయి. క్రైస్తవ మతస్థులు ఉదయం నుంచే భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఏసుక్రీస్తు జన్మదిన వేడుకల సందర్భంగా పాస్టర్‌లు, క్రైస్తవ మతపెద్దలు, బిషప్‌లు క్రీస్తు సందేశాన్ని భక్తులకు అందజేశారు. రంగురంగుల దీపాలతో, నూతన వస్త్రాలతో చిన్నారులు ఆడిపాడి అలరించారు. అయితే.. హైదరాబాద్ నగరం పరిధిలోని చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్దనున్న వెస్లీ చర్చిలో జరిగిన క్రిస్మస్ ప్రార్థనల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఏసుక్రీస్తు సూక్తులు ఆచరణీయమని మంత్రి తలసాని అన్నారు. ప్రపంచం మొత్తం ఎంతో ఘనంగా జరుపుకునే గొప్ప పండుగ క్రిస్మస్ అని పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధి అత్తాపూర్ తేజస్వి నగర్ కాలనీలో ఉన్న ట్రినిటీ చర్చిలో జరిగిన క్రిస్మస్ ప్రార్థనల్లో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పాల్గొన్నారు. మియాపూర్ కల్వరి టెంపుల్ లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బ్రదర్ సతీశ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. మాదాపుర్,గచ్చిబౌలి,రాయదుర్గం పరిధిలోని చర్చిల్లోనూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.