ముదిరాజ్ భవన్ శంఖుస్థాపనలో మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. గంగపుత్రుల మనో భావాలను కించపరిచేలా మాట్లాడిన తలసానిని వెంటనే బర్తరఫ్ చేయాలని హైదరాబాద్ చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్ లో గంగపుత్రుల సంఘం ఆందోళనకు దిగింది. తలసాని శ్రీనివాస యాదవ్ దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. కుల వృత్తిలో భాగంగా చెరువుల్లో చేపలు పెంచే హక్కు గంగపుత్రులదేననీ చెరువులపై ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
లేకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన దిగుతామని గంగపుత్రుల సంఘం హెచ్చరించింది. దీనికి ఆయన స్పందిస్తూ ముదిరాజ్ భవన్ శంకుస్థాపనలో నేను గంగపుత్రులను బాధపెట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తన వ్యాఖ్యలు ఏమైనా తప్పుగా ఉన్నాయని భావిస్తే గంగపుత్రులకు క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి గంగపుత్రుల సంక్షేమం, అభివృద్ధి పట్టించుకున్న వారు లేరన్న ఆయన గతంలో మత్స్యకార సొసైటీలలో వివిధ వర్గాల వారు సభ్యులుగా ఉన్నారని అన్నారు. మత్స్యకార వృత్తి పై ఆధారపడి జీవనం సాగిస్తున్న గంగపుత్రులు, ముదిరాజ్ లు, బెస్తలకు మేలు చేయాలనేది సీఎం ఉద్దేశ్యం అని ఆయన చెప్పుకొచ్చారు.