హైదరాబాద్ః తెలంగాణ రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇటీవల ఓ కార్యక్రమంలో చేసిన పలు వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. గంగపుత్రులపై మంత్రి తలసాని వ్యాఖ్యలు తగవనీ, ఆయనను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని అఖిల భారత గంగపుత్ర సంఘం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యలు కులాల మధ్య ఘర్షణలు పెట్టేలా ఉన్నాయని పేర్కొంది. అలాగే, గంగపుత్రుల కులవృత్తి ఏమిటో తెలియని వారికి సంబంధిత మంత్రిగా ఉండే హక్కు లేదని తీవ్ర స్థాయిలో మండిపడింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా మంత్రి తలసాని స్పందిస్తూ.. కోకాపేట్ ముదిరాజ్ భవన శంకుస్థాపన కార్యక్రమంలో తాను గంగపుత్రులను బాధపెట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలలో గంగపుత్రులను బాధించే తప్పుడు మాటలు ఉంటే క్షమాపణలు సైతం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని వర్గాల వారి అభివృద్ధికి కృషి చేస్తున్నదని తెలిపారు. బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని తలసాని వెల్లడించారు.