దాదాపు టీడీపీ-జనసేన పొత్తు ఖాయమైపోయినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు-జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ సారి కలిశారు..మళ్ళీ తాజాగా కూడా భేటీ అయ్యారు. రోడ్లపై సభలు, ర్యాలీలు పెట్టకూడదని వైసీపీ ప్రభుత్వం జీవో తీసుకురావడం..ఆ జీవోని వైసీపీ నేతలు పాటించడం లేదు గాని..ఆ జీవోని అడ్డం పెట్టుకుని పోలీసులు మాత్రం ప్రతిపక్షాలని ఇబ్బందులు పెడుతున్నారని, అందుకే ఆ జీవోని వెనక్కి తీసుకునేలా కలిసి పోరాడతామని బాబు-పవన్ అంటున్నారు.
ప్రస్తుతానికి పొత్తుల గురించి మాట్లాడుకోలేదని చెప్పారు. కానీ పరోక్షంగా పొత్తు ఫిక్స్ అయినట్లే కనిపిస్తోంది. ఎన్నికల ముందు పొత్తు అంశం తేలనుంది. ఎవరికి ఎన్ని సీట్లు దక్కుతాయో అప్పుడు తెలుస్తోంది. అలాగే బీజేపీ కలుస్తుందో లేదో కూడా అప్పుడే తెలియనుంది. అయితే ఇప్పటికే జనసేన కోసం కొందరు టీడీపీ నేతలు తమ సీట్లని త్యాగం చేయడానికి రెడీ అయ్యారు. ఉదాహరణకు తెనాలి సీటుని టీడీపీ నేత ఆలపాటి రాజా..జనసేన నేత నాదెండ్ల మనోహర్ కోసం వదులుకుంటున్నారు.
ఇలా కొన్ని నియోజకవర్గాలు జనసేనకు ఇస్తుండటతో అక్కడ ఉండే టీడీపీ నేతలు సైడ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. తాజాగా పవన్ పోటీ చేస్తానంటే తమ సీట్లని వదులుకోవడానికి రెడీగా ఉన్నామని టీడీపీ నేతలు ప్రకటిస్తున్నారు. దీని బట్టి చూస్తే టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఫిక్స్ అయినట్లే కనిపిస్తోంది. ఇక జనసేనకు ఎన్ని సీట్లు దక్కుతాయనేది ఇంకా క్లారిటీ లేదు.
ఇక ఈ పొత్తు ఉంటే తమకే ప్లస్ అని, జగన్ సింహంలా సింగిల్‌గా వస్తారని వైసీపీ నేతలు అంటున్నారు. మరోవైపు కాపుల ఓట్లని పవన్..బాబుకు తాకట్టు పెడుతున్నారని విమర్శలు చేస్తున్నారు. అంటే పొత్తుతో తమకు లాభమని చెబుతూనే..విమర్శలు చేస్తున్నారు..దీని బట్టి చూస్తే టీడీపీ-జనసేన పొత్తు లేకుండా చేయడమే వైసీపీ టార్గెట్ గా కనిపిస్తోంది.