ఏపీలో జరిగిన ఎన్నికల్లో టీడీపీకి తగిలిన షాకుతో చాలా మంది నేతలకు అసలు ఈ పార్టీలో భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకాలు రావడం లేదు. టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిపోవడంతో చాలా మంది నేతలు తాము పోటీ చేసిన నియోజకవర్గాల్లో అస్సలు అడ్రస్ లేకుండా పోతున్నారు. కొందరు ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి అస్సలు నియోజకవర్గాల వైపే చూడడం లేదు. కొందరు నామ్ కే వాస్తే ఒకటి రెండు సార్లు నియోజకవర్గాల్లో కనిపించినా మెల్ల మెల్లగా దూరమైపోతున్నారు. ఇప్పుడు టీడీపీ యంగ్ లేడీ లీడర్, మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్ కోడలు మాగంటి రూపాదేవి సైతం టీడీపీలో ఉంటే పొలిటికల్ ఫ్యూచర్ ఉంటుందన్న గ్యారెంటీ లేకపోవడంతో ఆమె టీడీపీలో సైలెంట్ అయినట్టు తెలుస్తోంది.
ఈ ఎన్నికల్లో తన మామ సిట్టింగ్ స్థానం అయిన రాజమహేంద్రవరం నుంచి టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేసిన ఆమె వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ చేతిలో 1.20 లక్షల ఓట్ల భారీ తేడాతో ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయాక కూడా ఆమె రెండు నెలల పాటు రాజమహేంద్రవరం వచ్చారు. పార్టీ కార్యకర్తలకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని.. ఎవరు ఏ ఫంక్షన్ ఉన్నా.. కార్యకర్తలకు ఇబ్బంది ఉన్నా చెపితే తాను వస్తానని కూడా ఆమె క్లారిటీ ఇచ్చారు. దీంతో మురళీమోహన్ 2009లో ఓడినా ఎలా కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారో ? రూపాదేవి కూడా అందుబాటులో ఉంటారని అనుకున్నారు.
అయితే ఇప్పుడు ఆమె రాజకీయాలపై ఇంట్రస్ట్‌గా లేరని తెలుస్తోంది. ఇందుకు ఆమెపై మురళీమోహన్ కుటుంబం నుంచి వచ్చిన ఒత్తిళ్లే కారణమంటున్నారు. రాజమండ్రిలో ఉన్న పార్టీ కార్యాలయాన్ని సైతం ఖాళీ చేశారనీ, సిబ్బందిని తొలగించారనీ, ఇక రూప రాజమండ్రికి వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చనీ టీడీపీ స్థానిక నేతలు కొందరు చర్చించుకుంటున్నారు. ఈ విషయాన్ని మురళీమోహన్ సన్నిహితులే చర్చించుకుంటుండడం విశేషం. రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా ఉన్నా తమ కుటుంబానికి ఒరిగిందేమి లేదని.. పైగా పార్టీ కోసం ఇంత కష్టపడినా విజయం సాధించకపోవడంతో మురళీమోహన్ కుటుంబం తమ వ్యాపారాలు దెబ్బ తింటున్నాయని… ఇప్పుడు పార్టీ చాలా ఘోరమైన స్థితిలో ఉండడంతో పార్టీ కార్యకలాపాలు ఐదేళ్ల పాటు కొనసాగించినా పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో ? అన్న డౌట్‌లో పడిపోయిందట.
ఈ నేపథ్యంలో రూపాదేవి రాజకీయాల్లో కొనసాగేందుకు ఆసక్తితో ఉన్నా ఐదేళ్ల పాటు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు కొనసాగించడం చాలా ఆర్థికభారంతో కూడుకున్నది కావడంతో ఆ విషయంలో కూడా మురళీమోహన్ కుటుంబం రూపాదేవికి సపోర్ట్ చేసే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె పార్టీ అధినేత చంద్రబాబు సైతం రూప రాజకీయాల్లో ఉంటుందని… మీరు ఇబ్బంది పెట్టవద్దని మురళీమోహన్ కుటుంబ సభ్యులకు చెప్పినా ఆమె బయటకు రావడం లేదంటున్నారు. పార్టీ అధినేత సమీక్షకు సైతం ఆమె డుమ్మా కొట్టేశారు. ఏదేమైనా రూపాదేవి రాజకీయాలకు దాదాపు దూరం అయినట్టే కనిపిస్తోంది.