మొన్నామధ్య జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఇసుక దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్లు నడుం బిగించారు. ఈ క్రమంలోనే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి.. తన వృద్ధాప్య సమస్యలను కూడా పక్కన పెట్టి పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన పిలుపుమేరకు దీక్షకు కూర్చున్నారు. ఈ విషయాన్ని రెండు రోజుల ముందుగానే పార్టీలో ప్రకటించారు. దీంతో ఆయన కూడా పార్టీ కార్యకర్తలకు కీలకమైన ద్వితీయ శ్రేణి నేతలకు ఫోన్లు చేసి స్వయంగా చెప్పారు. అయితే, వారు రాలేదు. దీంతో వచ్చిన కొద్ది మంది నాలుగో శ్రేణి కార్యకర్తలతోనే ఆయన దీక్షను మమ అనిపించారు.,
అనంతపురంలో అర్బన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి.. జగన్ ప్రభత్వం అన్నా క్యాంటీన్లను ఎత్తేయడాన్ని నిరసిస్తూ.. ఆందోళనలకు పార్టీ పిలుపివ్వడంతో ఆయన కూడా నిరసన వ్యక్తం చేసేందుకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే అర్బన్‌లోని ఓ వర్గం నాయకులకు ఆయన స్వయంగా ఫోన్ చేసి నిరసనకు ఆహ్వానించారు. కానీ, వారు రాలేదు. దీంతో ఉన్న పది మందితోనే ఆయన కార్యక్రమాన్ని నిర్వహించి.. ఫొటోలను మీడియాకు, పార్టీ కార్యాలయానికి పంపించారు. ఇక, పాలకొల్లోలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చేస్తున్న కార్యక్రమాలకు ద్వితీయ శ్రేణి నాయకులు హాజరు కావడం లేదు.
ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మాజీ మంత్రులు, ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీ ఆందోళనలకు హాజరు కాకుండా ఏవేవో పిల్ల కారణాలు చెప్పి తప్పుకొంటున్నారు. ఈ విషయం చాన్నాళ్లుగాపార్టీలో చర్చకు వస్తోంది. దీనిపై అంతర్గత చర్చల్లో చంద్రబాబుఇప్పటికే శ్రేణులకు హెచ్చరికలు జారీ చేశారు. అయినా వారిలో మార్పు రావడం లేదు. ఇక, తాజాగా పార్టీపరిస్థితిపై తెప్పించుకున్న నివేదకల్లో కూడా.. ఇదే తరహా అంశాలు ఎక్కువగా కనిపించాయి. దీంతో సీనియర్లు ఒక సూచన చేశారు.
పార్టీలో ఉన్న ద్వితీయ శ్రేణులకు ప్రస్తుతం ఉన్న పార్టీ పదవులు మార్చేయాలని, కొత్త వారికి యాక్టివ్ గా ఉన్నవారికి మాత్రమే ఛాన్స్ ఇవ్వాలని సూచించారు. దీనికి తాజాగా బాబు కూడా ఓకే అన్నారని తెలుస్తోంది. దీంతో త్వరలోనే కొత్తవారికి ఛాన్స్‌లు.. పాతవారికి శ్రీముఖాలు అందనున్నాయని సమాచారం. మరి ఇది పార్టీని బలోపేతం చేస్తుందో ఇంకా డైల్యూట్ చేస్తుందో చూడాలి.