కరోనా నేపథ్యంలో జనాలందరికీ భయం పట్టుకుంది. వైరస్ తమకు ఏవిధంగా అయినా సరే వ్యాపించవచ్చని చాలా మంది భయపడుతున్నారు. ఇక చాలా మంది మొబైల్ ఫోన్లను ఎక్కువగా ఉపయోగిస్తారు కనుక.. తమ ఫోన్లను వేరే వారు ఒక వేళ ముట్టుకుంటే.. తరువాత తాము వాటిని తీసుకుంటే.. ఆ వ్యక్తికి కరోనా ఉంటే.. తమకు కూడా ఆ వైరస్ వస్తుందని చాలా మంది భయాందోళనలకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే అనేక మంది ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్లతో తమ మొబైల్ ఫోన్లను శుభ్రం చేసుకుంటున్నారు.
అయితే నిజానికి కరోనా నేపథ్యంలో మొబైల్ ఫోన్లను శుభ్రం చేయడం మంచిదే. కానీ ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్లను వాడడం వల్ల మొబైల్ ఫోన్ డిస్‌ప్లేలు డ్యామేజ్ అవుతున్నాయి. వాటిపై పసుపు పచ్చని రంగు షేడ్ అయి కనిపిస్తోంది. అలాగే సదరు శానిటైజర్ ఫోన్ లోపలికి కూడా వెళ్తుంది. దీంతోపాటు ఫోన్‌కు ఉండే పోర్టులు, ఆడియో జాక్‌లోకి కూడా శానిటైజర్ వెళ్లి.. ఫోన్ షార్ట్ సర్క్యూట్‌కు గురవుతుంది. ఇలా అనేక మంది ఫోన్లు ప్రస్తుతం డ్యామేజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో కస్టమర్లు మొబైల్ రిపేరింగ్ సెంటర్లకు అలాంటి ఫోన్లను తీసుకెళ్లినప్పుడు అసలు విషయం తెలుస్తోంది. అయితే ఎవరైనా సరే మొబైల్ ఫోన్లను ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌తో కాకుండా ఇంకో విధంగా శుభ్రం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
మార్కెట్‌లో ఆల్కహాల్ ఉండే వైప్స్ (టిష్యూ పేపర్లు) అందుబాటులో ఉన్నాయి. వీటి సహాయంతో మొబైల్ ఫోన్లను తుడిస్తే ఫోన్లు డిసిన్‌ఫెక్ట్ అవుతాయి. దీంతో కరోనా ఉంటే నశిస్తుంది. అయితే ఈ వైప్స్‌ను ఫోన్ డిస్‌ప్లేపై జాగ్రత్తగా ఉపయోగించాలి. ఒకే ఒక్క వైప్‌ను తీసుకుని ఒక్కసారి మాత్రమే డిస్‌ప్లేపై తుడవాలి. ఇక యాంటీ బాక్టీరియల్ వైప్స్ కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా కూడా ఫోన్లను శుభ్రం చేసుకోవచ్చు. దీంతో కరోనా వ్యాప్తి చెందుతుందని భయం చెందాల్సిన పనిలేదు.
అయితే చాలా వరకు ఫోన్లకు డిస్‌ప్లేలు భిన్న రకాలుగా ఉంటాయి. అందువల్ల ఫోన్లను ఆల్కహాల్ వైప్స్‌తో శుభ్రం చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. అవసరం అయితే ఆ ఫోన్‌కు చెందిన తయారీ కంపెనీ కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాలి. తరువాతే ఫోన్లను సదరు వైప్స్‌తో శుభ్రం చేయాలి. ఇలా చేస్తే ఫోన్ల డిస్‌ప్లేలు, ఫోన్లు పాడవకుండా చూసుకోవచ్చు.