రాష్ట్రంలో ఇప్పుడు వైసీపీ పాలన మీద ఎంత వరకు టీడీపీ ఆరోపణలు చేసినా సరే వాస్తవ పరిస్థితులు మాత్రం నేతలు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారు. రాజకీయంగా జగన్ రోజు రోజుకు మరింత బలపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది అనే భావన టీడీపీ నేతల్లో ఎక్కువగా ఉంది. సంక్షేమ పథకాల విషయంలో టీడీపీతో పాటు మిగిలిన ప్రతిపక్షాలు ఎలాంటి విమర్శలు చేసినా అవి ప్రజలందరికి అందుతున్నాయి.
ఎక్కడో ఒకరో ఇద్దరు పథకాలు అందని వారు ఉంటే వారిని వేదికల మీదకు ఎక్కించి టీడీపీ విమర్శలు చేయిస్తోంది. వాటిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని తెలిసినా చంద్రబాబు మాత్రం మారడం లేదు. ఈ పరిణామాలు అన్నీ కూడా టీడీపీ నేతలు ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటున్నారు. ప్రధానంగా వైసీపీకి బలంగా ఉన్న రాయలసీమ జిల్లాల్లో… ఇది ఎక్కువగా ఉంది. అక్కడి నాయకుల్లో ఎక్కువగా ప్రజల్లో ఉండే వారే ఉంటారు. దీనితో వారికి పరిస్థితి ఎప్పటికప్పుడు అర్ధమవుతుంది.
చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో సైతం పరిస్థితి వైసీపీకి అనుకూలంగా ఉంది. కీలక టీడీపీ నేతలు అక్కడ ఓడిపోయారు. వరుసగా రెండు సార్లు గెలిచిన చిత్తూరు ఎంపీ సీటు టీడీపీ కోల్పోయింది. చివరకు బాబు సొంత జిల్లాలో ఆయన మినహా ఎవ్వరూ గెలవని దీనిస్థితికి టీడీపీ దిగజారిపోయింది. అనంతపురం జిల్లాలో 2004 లో టీడీపీకి మంచి స్థానాలే వచ్చాయి… అప్పుడు అంత వ్యతిరేకత ఉన్నా సరే 6 సీట్లు గెలిచింది. 2014లో రెండు సీట్లతో ఉన్న వైసీపీ ఈ ఎన్నికల్లో టీడీపీని కేవలం రెండు సీట్లకు పరిమితం చేసింది.
కడప జిల్లాలో పార్టీ పరిస్థితి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, కర్నూలు జిల్లాలో కూడా భూమా కుటుంబం దెబ్బకు కొన్ని వర్గాలు పార్టీకి దూరం జరిగాయి. ఈ జిల్లాల్లో నేతలు అందరూ పదవులు లేకపోయినా సరే రాజకీయ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని వైసీపీ లేదా బీజేపీ లోకి వెళ్లాలని తమ సన్నిహిత నేతలు ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారట. ఓవరాల్‌గా చూస్తే సీమలో టీడీపీ బతికి బట్టకట్టే పరిస్థితి లేదు.