ఏపీ మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. గంటా శ్రీనివాసరావు ఆస్తులను వేలం వేసేందుకు ఇండియన్ బ్యాంకు సిద్ధం కావడం గమనార్హం. గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలం రాజకీయ వర్గాలతో పాటు ఆయన నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాశంగా మారింది. డిసెంబర్ 20న ఆస్తులను వేలం వేయాలని బ్యాంకు అధికారులు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. గంటాకు చెందిన ప్రత్యూషా రిసోర్సెస్ అండ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేర ఇండియన్ బ్యాంక్ నుంచి భారీ రుణం తీసుకుని ఎగవేసినట్లు ఆరోపణలున్నాయి.
రుణ బకాయిలు సుమారు రూ.209 కోట్లు కాగా.. తనఖా పెట్టిన ఆస్తుల విలువ రూ.35 కోట్ల 35 లక్షల 61 వేలు మాత్రమే ఉన్నాయట. అయితే రుణ మొత్తాన్ని రాబట్టుకునేందుకు వ్యక్తి గత ఆస్తులను కూడా స్వాధీనం చేసుకునే హక్కు ఉందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ భూములు తనఖా పెట్టి బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్నారని గంటా శ్రీనివాసరావుపై గతంలోనూ ఆరోపణలు వచ్చాయి.
అయితే ఆ ఆరోపణలు ఈ రుణానికి సంబంధించినవి కాదని బ్యాంకు అధికారులు స్పష్టం చేశారు.
అయితే వేలానికి రానున్న గంటా వ్యక్తిగత ఆస్తుల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని ఫ్లాట్లు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ వేలం పాటకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గంటా కూడా న్యాయపరంగా అవకాశాల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆస్తులు వేలం వేయకుండా కోర్టు ద్వారా స్టే తెచ్చుకోగలిగితే వేలం ఆగిపోతుందని పలువురు పేర్కొంటున్నారు. గతంలో కూడా గంటా శ్రీనివాసరావుకు సంబంధించిన ఆస్తుల వేలం అంశంపై తెరపైకి వచ్చింది. దీనిపై గంటా కూడా వివరణ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత గంట ఆస్తుల వేలం అంశం తెరపైకి వచ్చింది.