ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ గ్రామంలో ఓ దళిత యువతిపై జరిగిన అత్యాచారంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. సదరు ఘటనపై యూపీ సర్కారు సీబీఐ దర్యాప్తుకు కూడా ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో పలువురు పోలీసు ఉన్నతాధికారులను కూడా సీఎం యోగి సస్పెండ్ చేశారు. అయితే తాజాగా అక్కడి ఓ బీజేపీ ఎమ్మెల్యే ఈ సంఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
యూపీలోని బలియాలోని బైరియా బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ తాజాగా హత్రాస్ ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విలువలు నేర్పాలని, దాంతోనే అత్యాచార ఘటనలు జరగకుండా ఉంటాయని అన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను అమ్మాయిలకు నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. కాగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమవుతున్నాయి.
మరో వైపు ఈ ఘటనపై దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అయితే యూపీ సీఎం యోగి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. అయితే సీఎం యోగి సర్కారు హత్రాస్ ఘటన కేసును సీబీఐకి అప్పగించింది. మరి సీబీఐ ఏం తేలుస్తుందో చూడాలి.