ఉపాధ్యాయ వృత్తికే కలంకం తెచ్చాడో టీచర్. విద్యా బుద్దులు నేర్పాల్సిన గురువే.. తన స్థానాన్ని మరిచి.. కన్ను మిన్ను కానకుండా.. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న మహేందర్ అనే వ్యక్తి.. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండాపురం గ్రామానికి చెందినవాడు.
ఈ నేపథ్యంలో భార్యపిల్లలతో కలిసి దాట్ల గ్రామంలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అయితే మహేందర్ పాఠశాలకు వచ్చే విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. తరచూ ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ లైంగికంగా వేధిస్తుండడం, మాట్లాడడంతో విసిగిపోయిన విద్యార్థులు తమ తల్లిదండ్రులకు మహేందర్ ప్రవర్తన గురించి చెప్పారు. దీంతో వారంతా బుధవారం ఉపాధ్యాయుడి ఇంటికి వెళ్లి నిలదీశారు. అంతేకాకుండా గ్రామస్తులు ఉపాధ్యాయుడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం ఓ విద్యార్థిని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు తొర్రూర్ సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐ మురళీధర్‌రాజు తెలిపారు.