అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఏపీ ప్రభుత్వం స్కూళ్లు నిర్వహించేందుకు సిద్దమవుతోంది. ఈ మేరకు ఇప్పటికే విధివిధానాలు రెడీ చేసింది. త్వరలో విద్యార్థులకు తరగతులు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తరగతులు నిర్వహించేందుకు స్కూళ్లు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే సూచనలు చేసింది. ఇక కేంద్రప్రభుత్వమైతే ఆగస్టు నెల నుంచి స్కూళ్లు తెరుచుకోవచ్చని మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా స్కూళ్లు తెరవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే స్కూళ్ళు తెరవడానికి పూర్తి సన్నద్ధత కాకముందే ఉపాధ్యాయ సంఘాలు విచారకరం వ్యక్తం చేస్తున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా పాటశాలల్లో పారిశుధ్య సమస్య ఎక్కువగా ఉందని యూటీఎఫ్ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూలై 1లోగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య సర్వీస్ పర్సన్స్‌ను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యావలంటీర్లను తక్షణం రెన్యువల్ చేయాలని అంటున్నారు. మధ్యాహ్నం భోజనం బియ్యం స్టాక్‌ను వెంటనే వెనక్కి పంపి కొత్త స్టాక్ తెప్పించాలని చెబుతున్నారు. ఉపాధ్యాయ బదిలీలపై సీఎం అసెంబ్లీలో హామీ ఇచ్చినా ఇంతవరకు ప్రక్రియ సాగలేదని ప్రశ్నిస్తున్నారు. పాఠశాల ల్లో మౌలిక సదుపాయాల కల్పన జరిగాకే స్కూళ్ళు తెరవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యక్ష బోధనతోనే విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని చెబుతున్నారు. పరీక్షలు లేకుండా పాస్ అవుతుండటం తో విద్యాప్రమాణాలు దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా జాగ్రత్తలపై తల్లిదండ్రులకు అనుమానాలు తీరేలా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేయాలని యూటీఎప్ టీచర్లు అంటున్నారు. మరి టీచర్ల డిమాండ్లపై సీఎం జగన్ దృష్టి సారిస్తారేమో చూడాలి.