భారత క్రికెట్ జట్టు రెండు గ్రూపులుగా విడిపోయిందని, కెప్టెన్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలు రెండు గ్రూపులకు లీడర్లుగా ఉన్నారని జోరుగా చర్చ సాగుతోంది.
తాజా జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీ సెమీ ఫైనల్‌లో భారత్ న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవడం ఏమోగానీ.. ఆ ఓటమి తాలూకు బాధ అటు ప్లేయర్లను, ఇటు అభిమానులను వీడడం లేదు. ఈ క్రమంలోనే టీమిండియా ఓటమికి అసలు కారణాలు ఏమిటా.. అని చాలా మంది తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఇక బీసీసీఐ ఓటమికి ఎవర్ని బాధ్యులను చేయాలా.. అని రంధ్రాన్వేషణ చేస్తోంది. అయితే ఇప్పుడు తెరపైకి మరో కొత్త అంశం వచ్చింది. అదేమిటంటే…
భారత క్రికెట్ జట్టు రెండు గ్రూపులుగా విడిపోయిందని, కెప్టెన్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలు రెండు గ్రూపులకు లీడర్లుగా ఉన్నారని జోరుగా చర్చ సాగుతోంది. కెప్టెన్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిలు వరల్డ్ కప్ టోర్నీ సందర్భంగా తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు రోహిత్ శర్మకు నచ్చలేదని, అలాగే మరికొంత మంది ప్లేయర్లకు కూడా ఆ నిర్ణయాలు నచ్చకపోవడంతో వారంతా రోహిత్ శర్మ వెంట ఉన్నారని తెలుస్తోంది. ప్రధానంగా టోర్నీలో గాయపడ్డ విజయ్‌శంకర్ స్థానంలో స్టాండ్‌బై గా ఉన్న అంబటి రాయుడును కాకుండా మయాంక్ అగర్వాల్‌ను తీసుకోవడం రోహిత్‌కు నచ్చలేదని తెలిసింది. దీంతో కెప్టెన్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిల నిర్ణయాలపై అసంతృప్తిగా ఉన్న రోహిత్ శర్మ, మరికొందరు ఆటగాళ్లు ఒక గ్రూప్‌గా ఏర్పడ్డారని సమాచారం.
కాగా టీమిండియాకు హెడ్ కోచ్ గా ఉన్న రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్‌గా ఉన్న భరత్ అరుణ్‌లను తప్పించాలని మెజారిటీ ఆటగాళ్లు అభిప్రాయపడుతున్నారట. వీరిద్దరి పద్ధతి నచ్చడం లేదని ప్లేయర్లు బాహాటంగానే చర్చించుకుంటున్నారట. వీరిని ఎంత వీలైతే అంత త్వరగా ఆయా బాధ్యతల నుంచి తప్పించాలని పలువురు భారత ఆటగాళ్లు ఇప్పటికే టీం మేనేజ్‌మెంట్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు తెలిసింది. 2017లో అప్పటి టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లేకు, కెప్టెన్ కోహ్లికి మధ్య మనస్పర్థలు వచ్చాక.. కోహ్లి కుంబ్లేను కాదని, రవిశాస్త్రికి ఓటు వేయడంతో అప్పటి నుంచి శాస్త్రి టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే తాజాగా వరల్డ్‌కప్ టోర్నీ సెమీ ఫైనల్‌లో టీమిండియా పేలవ ప్రదర్శన చేయడంతో కోచ్ శాస్త్రిపై వేటు వేయాలని జట్టు సభ్యులు కోరుతున్నారట. మరి బీసీసీఐ ముందు ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూస్తే తెలుస్తుంది..!