ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలిక్యాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. అప్రమత్తంగా వ్యవహరించిన పైలెట్ వెంటనే లోపాన్ని గుర్తించి హెలిక్యాప్టర్‌ను సేఫ్ ల్యాండింగ్ చేశాడు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం సీఎం కేసీఆర్ సోమవారం ఉదయం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి హెలిక్యాప్టర్‌లో దేవరకద్రకు బయలుదేరిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పైలెట్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోనే క్షేమంగా హెలిక్యాప్టర్‌ను దించేశాడు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ ఇవాళ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని దేవరకద్ర, నారాయణపేట, మక్తల్, గద్వాల్ నియోజకవర్గాల్లో్ జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే హెలిక్యాప్టర్‌లో సాంకేతిక లోపం కారణంగా ఆయన పర్యటన ఆలస్యమైంది. సీఎం పర్యటన కొనసాగేలా ఏవియేషన్ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఈనేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈసీకి లేఖ రాశారు. తమ హెలికాప్టర్ సాంకేతిక సమస్య తలెత్తిందని.. మరో హెలికాప్టర్ కి అనుమతి కావాలని కోరారు. దీంతో ఈసీ అనుమతితో వెంటనే మరో హెలికాప్టర్ రావడంతో దేవరకద్రకు బయలుదేరారు సీఎం కేసీఆర్.