అవసరాలకు అనుగుణంగా తెలంగాణకు వెంటనే ఎరువులు సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖా మంత్రి మాన్ సుఖ్ మాండవీయ కి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి లేఖ రాశారు. సకాలంలో ఎరువులు సరఫరా చేయాలని… రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఎరువులు సరఫరా చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. యాసంగిలో 20.5 లక్షల మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులు కేటాయించిన కేంద్రం… తెలంగాణ రాష్ట్ర అవసరాల మేరకు నెలవారీగా కావాల్సిన ఎరువుల కోసం సెప్టెంబరులో కేంద్రానికి లేఖ ద్వారా విన్నవించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
అక్టోబరు, నవంబరు మాసాలకు గాను 6.4 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులకు గాను కేవలం 3.67 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కేటాయించిన కేంద్రం… కేటాయించిన కోటాలో కూడా ఇప్పటి వరకు 1.55 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు మాత్రమే సరఫరా చేసింది. కేంద్ర కేటాయింపుల ప్రకారమే 2.12 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు ఇంకా రావాల్సి ఉంది. కాబట్టి ఇతర దేశాల నుండి వచ్చిన వెసెల్స్ నుండి ఎరువులు కేటాయించాలని కోరింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
గంగవరం పోర్టులోని ఐపీఎల్ కంపెనీ వెసెల్ నుండి 23 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని తాజాగా లేఖలో పేర్కొన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. కాకినాడ, విశాఖ పోర్టులలో ఉన్న ఆర్ సీ ఎఫ్, ఛంబల్, ఐపీఎల్ ఫర్టిలైజర్స్ కు చెందిన వెసెల్స్ నుండి 30 వేల మెట్రిక్ టన్నుల డీఏపీ కేటాయించాలని… క్రిబ్ కో కంపెనీ నుండి రెండు అదనపు రేక్ లు యూరియా కేటాయించాలని డిమాండ్ చేశారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. అక్టోబర్, నవంబర్ నెలలలో తక్కువగా సరఫరా చేసిన ఎరువులను డిసెంబర్ నుండి మార్చి సరఫరాలో భర్తీ చేయాలన్నారు.