నేటితో తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగింపు

-

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా ఇవాళ ఉభయ సభల్లో ఎఫ్‌ఆర్ఎంబీ అమల్లో కేంద్ర సర్కార్ ద్వంద్వ విధానాలపై చర్చించనున్నారు. కేంద్ర వైఖరితో రాష్ట్ర ప్రగతిపై ప్రభావం, విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. శాసనసభలో నిన్న ప్రవేశపెట్టిన ఏడు బిల్లులపై చర్చ జరగనుంది.

సిద్దిపేట జిల్లా ములుగు వద్ద ఉన్న ఫారెస్ట్‌ కళాశాలను వర్సిటీగా మారుస్తామని గత మార్చిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు వర్సిటీకి ప్రత్యేక చట్టం చేసేందుకు ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. తెలంగాణ అటవీశాస్త్ర విశ్వవిద్యాలయానికి రాష్ట్ర ముఖ్యమంత్రే ఛాన్స్‌లర్‌గా వ్యవహరించనున్నారు. తొలిసారిగా అటవీ వర్సిటీకి సీఎం కులపతి కాబోతున్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు-2022 బిల్లు సహా మొత్తం ఏడు బిల్లులను అసెంబ్లీలో సోమవారం ప్రవేశపెట్టారు.

తెలంగాణ వస్తు సేవల పన్ను బిల్లు-2022, ఆజామాబాద్‌ పారిశ్రామిక ప్రాంతం రద్దు, మున్సిపల్‌ చట్టాల సవరణ, బోధనాసుపత్రుల వైద్యనిపుణుల వయోపరిమితి పెంపు, తెలంగాణ మోటారు వాహనాల పన్నుల సవరణ బిల్లులను ఆయా మంత్రులు ప్రవేశపెట్టారు. శాసనసభలో ఆమోదం అనంతరం మండలిలో బిల్లులపై చర్చించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version