తెలంగాణా కేబినేట్ త్వరలోనే సమావేశం అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. తెలంగాణాలో కరోనా కేసులు పెరగడంతో ఇప్పుడు తెలంగాణ సర్కార్ మరిన్ని చర్యలకు సిద్దమవుతుంది. ఇప్పటికే లాక్ డౌన్ ని పెంచడానికి సిద్దమైంది తెలంగాణా ప్రభుత్వం. మే 7 వరకు అంటూ కేంద్రం చేసిన ప్రకటనకు మరో నాలుగు రోజులు పెంచింది. అయినా సరే కేసులు మాత్రం రాష్ట్రంలో పెరుగుతూనే ఉన్నాయి.
సూర్యాపేట, హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలో రోజు రోజుకి కరోనా తీవ్రత పెరుగుతూ వస్తుంది. రాష్ట్రంలో ఈ పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తుంది. దీనితో కేసీఆర్ ఇప్పటికే రాష్ట్ర స్థాయి బృందాన్ని క్షేత్ర స్తాయికి పంపాలి అని భావించారు. సియేస్, డీజీపీ, వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి, మెడికల్ డైరెక్టర్లు అందరూ కూడా క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేయడానికి సిద్దమయ్యారు. కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల మీద దృష్టి పెట్టారు.
ఇక మే 5 న కేబినేట్ సమావేశం నిర్వహిస్తామని తెలంగాణా సర్కార్ చెప్తుంది. అయితే ఈ లోపే ఈ సమావేశాన్ని నిర్వహించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని సమాచారం. ముందు లాక్ డౌన్ సడలింపులు, కేసుల తీవ్రత, లాక్ డౌన్ ని మరింత కఠినం గా ఎక్కడ అమలు చెయ్యాలి అనే దాని మీద ఆయన మంత్రి వర్గంతో చర్చించి నిర్ణయం తీసుకునే సూచనలు కనపడుతున్నాయి. ఏ మాత్రం వెనకడుగు వేసినా సరే ఇబ్బందులు వస్తాయని ఆయన భావిస్తున్నారు.