తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు…మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావుకి అరుదైన గౌరవం దక్కింది. హిమాన్షు రావుకి డయానా అవార్డు దక్కింది. తొమ్మిది సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయస్సు ఉన్న వారికి ఇచ్చే ఈ అవార్డు ఈ సారి హిమన్షు రావు కి దక్కింది. సమాజంలో మార్పు కోసం మానవీయ దృక్పథంతో చేసే పనులకి ఈ అవార్డు ఇస్తారు. దివంగత బ్రిటన్ రాజకుమారి డయానా పేరు మీద ఈ అవార్డుని ఏర్పాటు చేయడం జరిగింది. బ్రిటన్ కేంద్రంగా ఈ అవార్డును ప్రధానం చేసే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా యువకులు చేసే సోషల్ వర్క్ ని ఈ అవార్డు కోసం పరిగణలోకి తీసుకుంటుంది.
హిమాన్షు గ్రామాల్లో స్వయం సమృద్ధి దిశగా చేపట్టాల్సిన పలు అంశాలను పరిగణలోకి తీసుకుని స్వయంగా శోమ పేరుతో ఒక ప్రాజెక్ట్ ప్రారంభించారు. గజ్వేల్ నియోజకవర్గంలో గంగాపూర్ మరియు యూసుఫ్ ఖాన్ పల్లి గ్రామాల్లో ఈ మేరకు ఆయన పలు కార్యక్రమాలను చేపట్టారు. ఈ ప్రాజెక్టు కోసం తనకు సంపూర్ణ మార్గదర్శనం చేసిన తన తాత గారు, గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి హిమాన్షు ఈ అవార్డు వచ్చిన సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. గ్రామాల్లో స్వయం సమృద్ధి సాధించేందుకు తనకున్న ఆలోచనల మేరకు చేపట్టిన ఈ ప్రాజెక్టుకి సహకరించిన రెండు గ్రామాల ప్రజలకు మరియు తన మెంటార్స్ కి ఈ సందర్భంగా హిమాన్షు రావు కృతజ్ఞతలు తెలిపారు.