ఇబ్రహీం పట్నం సామాజిక ఆరోగ్య కేంద్రం ఘటనలో దర్యాప్తుకు ప్రత్యేక కమిటీని నియమించినట్లు ప్రజారోగ్య సంచాలకులు డా.శ్రీనివాస్‌రావు తెలిపారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం అందిచనున్నట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా శస్త్రచికిత్సలు చేసిన వైద్యుడి లైసెన్సును రద్దు చేసి వైద్యుడిని సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రెండుపడకలగదులు కేటాయించడంతో పాటు అన్ని రకాలుగా అండగా ఉంటామని ప్రభుత్వం తెలిపిందని పేర్కొన్నారు.
ఈ నెల 25న ఇబ్రహీంపట్నం పరిధిలో 34 మందికి డబుల్ పంచర్ లాప్రోస్కోపి నిర్వహించామని డీహెచ్ తెలిపారు. కుటుంబ నియంత్రణకు సంబంధించి దేశ వ్యాప్తంగా డీబీఎల్ అనేది అడ్వాన్స్ మెథడ్ అని చెప్పారు. ఇబ్రహీంపట్నంలో మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని.. 34 మందికి ఈ ఆపరేషన్ చేస్తే దురదృష్టవశాత్తు అందులో నలుగురు మరణించారని వెల్లడించారు.
మృతుల పోస్టుమార్టం నివేదిక వచ్చాకే వారి మరణానికి గల కారణం తెలుస్తుందని డీహెచ్ అన్నారు. కేంద్రం ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారమే ఆపరేషన్లు నిర్వహించినట్లు తెలిపారు. ఇకపై శస్త్రచికిత్స సమయంలో కచ్చితమైన నిబంధనలు అమలు చేసేలా జాగ్రత్తపడతామని చెప్పారు.