ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న ముస్లిం విద్యార్థినులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పంది. పదో తరగతి పరీక్షలకు బుర్ఖా ధరించి వచ్చే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బుర్ఖాలను తొలగించాలని కోరవద్దని సూచించింది. అయితే ఆ విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ఇందుకోసం ప్రత్యేకంగా మహిళా టీచర్‌ను ఏర్పాటు చేసి నిషేధిత వస్తువులు తీసుకెళ్లకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉన్నతాధికారులు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్(సీఎస్‌డీవో) అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.
- పరీక్ష కేంద్రాల్లో సెల్‌ఫోన్లపై నిషేధం విధించిన నేపథ్యంలో బందోబస్తులో ఉన్న పోలీసు అధికారుల ఫోన్ నంబర్ల ద్వారా విద్యార్థుల హాజరు శాతాన్ని అధికారులకు చేరవేయాలి.
- ప్రశ్నపత్రాలను 1-15 నిమిషాల ముందుగా సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే తెరవాలి. ప్రశ్నపత్రాలు సక్రమంగా ఉన్నాయో, లేదో ముందే సరి చూసుకోవాలి. అంతకుముందు ఎట్టి పరిస్థితుల్లో తెరువొద్దు.
- పరీక్ష కేంద్రాల్లో జిల్లా డీఈవోల సెల్ నంబర్లను ప్రదర్శించాలి. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా స్థానిక పీహెచ్‌సీ డాక్టర్ నంబర్‌ను అందుబాటులో ఉంచాలి.
- సీఎస్‌డీవోలు పోలీసు అధికారులను సంప్రదించి పరీక్ష కేంద్రాలకు సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయించాలి.
- అంధులు, కంటిచూపు లోపం ఉన్న వారికి చీఫ్ సూపరింటెండెంట్లు స్ర్కైబ్‌లను (సహాయకులను) నియమించాలి.
- లాటరీ తీసి రోజువారీగా టీచర్లకు ఇన్విజిలేషన్ విధులు కేటాయించాలి.
- పరీక్షకు ఒక రోజు ముందు ఇన్విజిలేటర్లతో సమావేశాన్ని నిర్వహించాలి.
- విద్యార్థులు శానిటేషన్ చేసుకోవడానికి శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి.
- విద్యార్థులు పరీక్షలు సవ్యంగా రాసుకొనేందుకు వీలుగా డ్యుయల్ డెస్క్ బల్లలు ఉండేలా చూడాలి.
- పరీక్ష సిబ్బంది కచ్చితంగా ఫొటో ఐడీ కార్డులను ధరించాలి.
- సీఎస్‌డీవోలు, ఇన్విజిలేటర్లు, పోస్టాఫీస్ డిస్పాచ్, ప్రశ్నపత్రాల రిజిస్టర్లను నిర్వహించాలి.