2021 – 2022 సంవత్సరానికి గాను రైతుభీమా కోసం ఎల్ఐసీ ప్రతినిధులకు చెక్కును అందజేశారు తెలంగాణ మంత్రులు. ఈ కార్యక్రమంలో కల్వకుంట్ల తారక రామారావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, జగదీశ్వర్ రెడ్డి, మరియు ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ…రైతుభీమా కోసం రూ.1450 కోట్లు విడుదల చేశామని చెప్పారు.
ప్రపంచంలో రైతుకు ప్రీమియం చెల్లించి భీమా కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. అన్నం పెట్టే రైతన్న ఆత్మవిశ్వాసంతో సాగు చేసేందుకే వ్యవసాయ అనుకూల విధానాలు అమలు చేస్తామని ప్రకటించారు.
రైతుబంధు, రైతుభీమా, 24 గంటల ఉచిత కరంటు, వందశాతం పంటల కొనుగోళ్లతో తెలంగాణ రైతాంగం ఆత్మస్థయిర్యం పెరిగిందన్నారు.సమైక్యరాష్ట్రంలో నష్టపోయిన రైతాంగం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్తశుద్దికి వ్యవసాయరంగ పథకాలు నిదర్శనమని తెలిపారు. సమైక్య పాలనలో రైతుకు కష్టం వస్తే పట్టించుకున్న నాధుడు లేడన్నారు. రూ.50 వేల ఆపద్భంధు సొమ్ము కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన అరకొర మందికే అది దక్కేదన్నారు.కానీ ఇప్పుడు రైతు ఏ కారణం చేత మరణించినా పది రోజుల లోపు రూ.5 లక్షల చెక్కును ఇంటికి తెచ్చిస్తున్న తెలంగాణ ప్రభుత్వమని తెలిపారు.