ప్రజా ప్రభుత్వం మరో రికార్డు నెలకొల్పింది. ఒకే రోజు నాలుగు సంక్షేమ పథకాలను విజయవంతంగా ప్రారంభించటంతో పాటు.. అక్కడికక్కడే 6,15,677 మంది అర్హులకు లబ్ధి కల్పించింది. అదే రోజున రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ఆర్థిక శాఖ రూ. 579 కోట్లు విడుదల చేసింది. లక్షలాది మంది రైతులు, వ్యవసాయ కూలీల కుటుంబాల్లో ఈ నిధులు జమ కావటంతో రాష్ట్రమంతటా ఆనందం వెల్లివిరిసింది. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ప్రకటించిన విధంగానే ప్రజా పాలనలో నాలుగు సంక్షేమ పథకాలు విజయవంతంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజునే లక్షలాది మంది ఈ సంక్షేమ పథకాలను అందుకున్నారు.
గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఎంపిక చేసిన 563 గ్రామాల్లో ఈ పథకాలను ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. ఆయా గ్రామాల్లో ఉన్న రైతులకు రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఆర్థిక సాయాన్ని అప్పటికప్పుడే వారి ఖాతాల్లో జమ చేసింది. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేసింది.