విమోచన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమ సమయంలో హైదరాబాద్ ప్రాంతంలో జరిగిన పోరాటం చరిత్రాత్మక స్వాతంత్ర్య పోరాటాలలో ఒకటని అన్నారు. ఈ చిరస్మరణీయమైన రోజును ఇప్పుడు గర్వంగా జరుపుకుంటున్నామని ఆమె తెలిపారు.
స్వాతంత్య్ర పోరాటంలో అత్యున్నత త్యాగాలు చేసిన చేసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విజ్ఞప్తి చేశారు. స్వాతంత్య్ర సమరయోధులను.. వారి త్యాగాలను అందరూ గుర్తుపెట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నో కష్టాలు పడిన హైదరాబాద్ వాసులు.. నిజాం పాలన నుంచి స్వాతంత్య్రం పొందడంతో విమోచన దినోత్సవం జరుపుకుంటున్నామని గవర్నర్ తెలిపారు.
“నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. వరంగల్ పరకాలలో 35 మందిని వరుసలో నిలబెట్టి నిజాం రాజులు తుపాకీతో కాల్చి చంపారు. నిజాం పాలన నుంచి స్వాతంత్య్రం పొందడంతో విమోచన దినోత్సవం జరుపుకుంటున్నాం. స్వాతంత్య్రం కోసం పోరాడిన సమరయోధుల త్యాగాలను అంతా గుర్తుపెట్టుకోవాలి.” – తమిళి సై సౌందరరాజన్, తెలంగాణ గవర్నర్