ఎమ్మెల్యేల ఎర కేసు పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ

-

టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు అంశంపై ఇవాళ హైకోర్టు విచారణ జరపనుంది. ఈ కేసును సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణకు అప్పగించాలని బీజేపీ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. రాష్ట్ర పోలీసుల దర్యాప్తుపై విశ్వాసం లేదని బీజేపీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. నిందితులకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేకపోయినా తమ నేతలపై దుష్ప్రచారం చేసేందుకు కేసులు పెట్టారని పిటిషన్​లో పేర్కొన్నారు. గతంలో పిటిషన్​పై విచారణ జరిపిన హైకోర్టు.. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసే వరకు దర్యాప్తు నిలిపివేయాలని ఆదేశించింది. దీంతో ప్రస్తుతం కేసు దర్యాప్తు ఆగిపోయింది.

పిటిషన్ కొట్టివేయాలంటూ కేసు తీవ్రతను వివరిస్తూ నిన్ననే ప్రభుత్వం సుదీర్ఘ కౌంటర్ దాఖలు చేసింది. సుమారు మూడు గంటల వీడియోలను కూడా హైకోర్టుకు సమర్పించింది. ఈ కేసులో ఫోన్ టాపింగ్ జరిగిందని తనను ఇంప్లేడ్ చేయాలంటూ జర్నలిస్టు శివప్రసాద్ రెడ్డి కూడా ఓ పిటిషన్ దాఖలు చేశారు. సీఎం పర్యవేక్షణలో కేసు దర్యాప్తు జరుగుతున్నందున పోలీసులపై నమ్మకం లేదని సీబీఐకి లేదా స్వతంత్ర విచారణకు ఆదేశించాలని.. అప్పటివరకు ఆడియోలు వీడియోలు విడుదల చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని నిందితుడు నందకుమార్ భార్య చిత్రలేఖ కూడా మరో పిటిషన్ దాఖలు చేశారు. అన్నింటినీ కలిపి ఇవాళ హైకోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version