జీవో 111 విషయంలో ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి

-

జీవో 111కు సంబంధించిన పిటిషన్లలో ప్రభుత్వం కౌంటరు దాఖలు చేయకపోవడంపై హైకోర్టు సోమవారం అసంతృప్తి వ్యక్తం చేసింది. కౌంటరు సమర్పించాలని గతంలో ఆదేశించినా.. అమలు చేయకపోవడాన్ని తప్పుబట్టింది. కోర్టు ఉత్తర్వులంటే ఇంత ఉదాసీనత సరికాదంది. చివరిగా ఈ ఒక్కసారికి గడువు ఇస్తున్నామంటూ విచారణను వాయిదా వేసింది.


హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ల పరిరక్షణ నిమిత్తం గతంలో జారీ చేసిన జీవో 111ను అమలు చేసేలా ఆదేశాలివ్వాలంటూ పర్యావరణవేత్త ప్రొ.జీవానందరెడ్డి తదితరులు 2007లో దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డిల ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది కె.ఎస్‌.మూర్తి వాదనలు వినిపిస్తూ హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ల నీటి పరీవాహక ప్రాంతాల పరిరక్షణకు వాటి పరిధిలో 10 కిలోమీటర్ల మేర నిర్మాణాలు చేపట్టరాదని గతంలో ప్రభుత్వం జీవో 111 జారీ చేసిందన్నారు.

ఏజీ కార్యాలయం తరఫున ప్రభుత్వ సహాయ న్యాయవాది పి.ఉష వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు ఇందులో మరో అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారంటూ.. కౌంటరు దాఖలు చేయడానికి 3వారాల గడువు కావాలని కోరారు.

దీనిపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ పిటిషన్లు దాఖలు చేసి 15 ఏళ్లు గడిచిపోయాయని, గతంలో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశాలిచ్చినా మళ్లీ గడువు కోరడమేమిటని ప్రశ్నించింది. ఖర్చుల కింద రూ.25 వేలు చెల్లిస్తే వాయిదా వేస్తామని, చెల్లిస్తారా అంటూ ప్రశ్నించింది. హెచ్‌ఎండీయే తరఫు న్యాయవాది వై.రామారావు జోక్యం చేసుకుంటూ జీవో 111కు సంబంధించి రెండు విరుద్ధమైన అభ్యర్థనలతో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version