– జూబ్లిహిల్స్ లో ఉచిత తాగునీటి పథకం అధికారికంగా ప్రారంభం
– పేదల అభివృద్ధే లక్ష్యమన్న తెలంగాణ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ః తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో రెండు రోజుల ముందే సంక్రాంతి ప్రారంభమైందని టీఆర్ఎస్ నేత, రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉచిత తాగునీటి పథకాన్ని జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో కేటీఆర్ మంగళవారం అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. అలాగే, పేదల ప్రజల అభివృద్దే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని చెప్పారు.
నగరంలో ఉన్న అందరికీ ఉచితంగా తాగునీటిని అందించడానికే ఈ పథకం తీసుకువచ్చామని తెలిపారు. బస్తీలలో ఉండే పేదల ప్రజల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించామని తెలిపారు. బలహీన వర్గాల పిల్లల చదువులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామనీ, పేదల్లో చాలా మందిని విదేశాలకు పంపించి చదివిస్తున్నామని వెల్లడించారు. అలాగే, కేటీఆర్.. తన కాలేజీ రోజులను గుర్తు చేసుకుంటూ.. తాను చుదువుకునే రోజుల్లో మంచి నీటి కోసం ఆందోళనలు, ధర్నాలు జరిగాయనీ, వాటన్నింటిని అధిగమించి నేడు ఉచితంగా నీటిని అందించే స్థాయికి చేరుకున్నామని వివరించారు.
కాగా, ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ, సీఎస్ సోమేశ్ కుమార్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఇక ప్రభుత్వం ప్రారంభించిన ఈ ఉచిత తాగునీటి పథకం ద్వారా గ్రేటర్ పరిధిలో ఒక్కో కుటుంబానికి నెలకు 20వేల లీటర్ల వరకు నీటిని ఉచితంగా అందిస్తారు. ఇక బస్తీల్లో నల్లాలకు మీటర్ల తో సంబంధం లేకుండా ఉచితంగా నీరు అందిస్తారు. కానీ మిగతా ప్రాంతాల్లో మీటర్లు తప్పనిసరిగా ఉండటంతో పాటు 20వేల లీటర్లు దాటిన నీటి వినియోగంపై పాత ఛార్జీలు వసూలు చేస్తారు.