బీజేపీ నుంచి గెలిచిన ఆ ముగ్గురు ఎంపీలు కూడా నిర్వేదంలో ఉన్నారు. బండి సంజయ్ ( కరీంనగర్ ) ధర్మపురి అరవింద్ (నిజామాబాద్), సోయం బాబురావు(ఆదిలాబాద్) ఈ ముగ్గురు కూడా ఎంపీ పదవి ఈ టెర్మ్ తో చాలు ఇక వద్దు అని నిర్ణయించుకున్నారు అని సమాచారం. అన్నీ బాగుంటే ఎమ్మెల్యే స్థానాలకు పోటీచేసి సత్తా నిరూపించుకోవాలని భావిస్తున్నారు.
దేశ రాజకీయాల్లో రాణించేందుకు పెద్దగా స్కోప్ ఉండడం లేదు అన్నది వీళ్ల భావన అని తెలుస్తోంది. కేంద్రం దగ్గర మాట్లాడేందుకు లేదా తిరుగుబాటు స్వరం వినిపించేందుకు తమకు ఈ పదవి పెద్దగా కలిసి రాలేదన్న నిర్వేదంతోనే వీరంతా ఈ నిర్ణయానికి వచ్చారని పొలిటికల్ వర్గాలు అంటున్నాయి.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కూడా అటుగా వెళ్లరు అని తేలిపోయింది. మల్కాజిగిరి ఎంపీగా ఉన్న ఆయన వచ్చే ఎన్నికల్లో అస్సలు పార్లమెంట్ కు పోరాదనే ఫిక్స్ అయ్యారు. కొడంగల్ నుంచి కానీ ఎల్బీనగర్ నుంచి కానీ పోటీ చేసేందుకే అవకాశాలు ఉన్నాయి. ఆయనే కాదు చాలా మంది ఇదే భావనలో ఉన్నారు. రాజకీయ భవిష్యత్ దృష్ట్యా కూడా ఎంపీ కన్నా ఎమ్మెల్యే అయితేనే బాగుంటుందన్న వాదన కూడా బలీయంగా వినిపిస్తోంది.
ఎంత మాట్లాడినా ఎంత పోట్లాడినా కూడా ఎంపీ పదవి వద్దు అని ఒక నిర్ణయానికి వస్తున్నారు తెలంగాణ నాయకులు. ఎంపీ పదవి కారణంగా పెద్దగా పోగేసుకుంటున్న ప్రయోజనం ఏమీ లేదనే అంటున్నారు. ఢిల్లీ రాజకీయాల్లో పెద్దగా పనిచేసేందుకు ఏమీ ఉండదని, అదే ఎమ్మెల్యే అయితే కాస్తో కూస్తో రాజకీయంగా బలం సమీకరించుకోవచ్చని వాళ్ల అభిప్రాయం.
ఎంపీ అయినా వ్యక్తిగతంగా అభిప్రాయం చెప్పేందుకు కూడా ఏ అవకాశం దక్కడం లేదు. కేంద్ర మంత్రుల దగ్గరకు ఫ్లోర్ లీడర్లు తప్ప ఇంకెవ్వరూ వెళ్లరు. ఆ దశలో ఫ్లోర్ లీడర్ పైనే ఆధారపడాలి. మీడియా ముందుకు వచ్చి మాట్లాడినా కూడా పెద్దగా ఉపయోగం ఉండడం లేదు. అందుకే చాలా మంది ఎంపీ పదవి వద్దని ఎమ్మెల్యే పదవే ముద్దు అని కొత్త స్లోగన్ ఒకటి తెరపైకి తెస్తున్నారు.