సర్కారీ కొలువుల చుట్టూ తెలంగాణ రాజకీయం

-

తెలంగాణలో రాజకీయం అంతా ఉద్యోగ కల్పన చుట్టూ తిరుగుతోంది. సవాళ్లు, ప్రతిసవాళ్లతో హోరెత్తుతోంది. లక్షకు పైగా ఉద్యోగాలు కల్పించామని అధికార పక్షం చెబుతుంటే.. చర్చకు రావాలని విపక్షాలు సవాల్ విసురుతున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో ఉద్యోగాల రగడ తారస్థాయికి చేరింది. తెలంగాణలో ఉద్యోగ నియామకాలపైఅధికార విపక్షాల మధ్య మాటలయుద్ధం..సీరియల్‌లా కొనసాగుతూనే ఉంది.

ఉద్యోగ కల్పనపై తెలంగాణలో రాజకీయం హాట్‌హాట్‌గా సాగుతోంది. మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్ కి విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఓయూ ఆర్ట్స్ కాలేజీ వేదికగా చర్చిద్దామని నిన్న ఓయూలో హడావిడి చేశారు బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఉస్మానియాకు రాలేదని ప్రశ్నించిన రామచంద్రరావుకు బీజేపీ ఇచ్చిన హామీలెక్కడున్నాయో వెతకడంలో బిజీగా ఉన్నానన్నారు.

ఇక ఈరోజు టీఎస్ పీఎస్సీ ముందు బీజేపీ యువమోర్చా ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాల్ని వెంటనే భర్తీ చేయాలంటూ హైద్రాబాద్‌లోని బీజేపీ కార్యాలయం నుంచి టిఎస్పీఎస్సీ ఆఫీస్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగాల భర్తీతో పాటు నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యాలయం లోనికి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. తోపులాటతో ఉద్రిక్తతకి దారి తీసింది.

ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు చొప్పున..12 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చిందన్నారు. ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా జన్‌ ధన్‌ ఖాతాల్లో 15లక్షలు చోప్పున వేస్తామని మోడీ హామీ ఇచ్చారని దాని సంగతి ఏంటని ప్రశ్నించారు. మరో వైపు కాంగ్రెస్ నేతలు సర్కారీ కొలువుల పై గట్టిగానే టీఆర్ఎస్ సర్కార్ ని నిలదీస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం నియమించిన కమిషన్‌ రిపోర్ట్ ప్రకారం.. లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. ఇదే అంశంపై పే రివిజన్ సైతం నివేదిక ఇచ్చిందన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన పబ్లిక్ కమిషన్ సైతం సిబ్బంది కొరతతో ఇబ్బందులు పడుతోందన్నారు.

ఓవైపు ఉద్యోగాలు భర్తీ చేశామని అధికార పక్షం వాదిస్తుంటే.. తప్పుడు లెక్కలంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ సర్కారి కొలువుల చుట్టే తెలంగాణ రాజకీయం నడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version