సంక్రాంతికి సిద్ధమైన తెలంగాణ ఆర్టీసీ..!

-

సంక్రాంతి నేప‌థ్యంలో సొంతూళ్లకు వెళ్లే వారిని క్షేమంగా గ‌మ్య‌స్థానాల‌కు చేరవేసేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పూర్తి స్థాయిలో స‌న్న‌ద్ద‌మైంది. ఈ పండుగ‌కు 6432 ప్రత్యేక బస్సులను నడపాలని యాజ‌మాన్యం ఇప్ప‌టికే నిర్ణ‌యించింది. ప్ర‌ధానంగా ఈ నెల 10, 11, 12 తేదిల్లో ప్ర‌యాణికుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంది. ఆయా రోజుల్లో ర‌ద్దీ మేర‌కు ప్ర‌త్యేక బ‌స్సుల‌ను అందుబాటులో ఉంచేలా ప్లాన్ చేసింది. అలాగే, ఈ నెల 19, 20 తేదిల్లో తిరుగు ప్ర‌యాణ ర‌ద్దీకి సంబంధించి త‌గిన ఏర్పాట్లు చేసింది.

హైదరాబాద్ లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్స్‌, ఆరాంఘర్‌, ఎల్బీనగర్‌ క్రాస్‌ రోడ్స్‌, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోంది. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల సౌక‌ర్యార్థం పండల్స్, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయ‌నుంది. సంక్రాంతి పండుగ‌కు న‌డిపే ప్ర‌త్యేక బ‌స్సుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ జీవో ప్రకారం 1.50 వ‌ర‌కు టికెట్ ధ‌ర‌ల‌ను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం స‌వ‌రించింది. తెలంగాణ‌తో పాటు ఇత‌ర రాష్ట్రాల‌కు తిరిగే స్పెషల్ బస్సులకు మాత్రమే సవరించిన చార్జీలు వర్తిస్తాయి. ఈ నెల 10, 11, 12 తేదిల‌తో పాటు తిరుగు ప్ర‌యాణ ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే 19, 20 తేదిల్లో మాత్ర‌మే స‌వ‌రించిన చార్జీలు అమ‌ల్లో ఉంటాయి. స్పెష‌ల్ బ‌స్సులు మిన‌హా రెగ్యూల‌ర్ బ‌స్సుల్లో సాధార‌ణ చార్జీలే అమ‌ల్లో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం య‌థావిధిగా అమల్లో ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version