రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదించిన స్పీకర్​

-

మునుగోడు ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజీనామా లేఖను శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి సమర్పించారు. పోచారం తన రాజీనామాను ఆమోదించినట్లు రాజగోపాల్ రెడ్డి తెలిపారు.  అంతకుముందు గన్​పార్కుకు చేరుకున్న రాజగోపాల్​ రెడ్డి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

తెరాస.. తెలంగాణ ద్రోహుల పార్టీ అయిందని మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి విమర్శించారు. తెరాస, కాంగ్రెస్‌ పార్టీల్లో ఉన్న చాలా మంది నేతలు తనతో మాట్లాడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

తెరాస ప్రభుత్వంపై ధర్మయుద్ధం ప్రకటించానని.. దీనిలో తెలంగాణ, మనుగోడు ప్రజలు గెలుస్తారని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. చండూరు సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఆయన మనుషులు మాట్లాడిన భాష విన్న తర్వాత తెలంగాణ సమాజం తల దించుకుంటోందన్నారు. అలాంటి వ్యక్తి పార్టీ అధ్యక్షుడని.. సీఎం అవుతారంట అని వ్యాఖ్యానించారు.

‘డబ్బులిచ్చి పదవులు తెచ్చుకున్నవాళ్లు.. తప్పుడు పనులతో జైలుకెళ్లి వచ్చినవారు మాట్లాడుతున్నారని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఏ త్యాగం చేయకుండా.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొనకుండా ఇప్పుడు మాట్లాడితే తెలంగాణ ప్రజలు నమ్మరని చెప్పారు. కోమటిరెడ్డి సోదరులను తిట్టించిన భాష విన్న తర్వాత అందరూ ఆలోచించాలి’’ అని రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version