కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై చాలా రాష్ట్ర ప్రభుత్వాలు గరం గరం అవుతున్నాయి. కేవలం త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం బడ్జెట్ ను తీసుకువచ్చారని పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోపిస్తున్నాయి. దీనిలో భాగంగానే కేరళ, బెంగాల్, అసోం రాష్ట్రాలకు భారీగా కేటాయింపులు జరిపాయని ఆరోపిస్తున్నాయి. ఇక ప్రతిపక్ష పార్టీలు ప్రజా సంక్షేమాన్ని మరిచి.. కార్పొరేట్లకే మేలు కలిగేలా ఈ బడ్జెట్ ఉందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.
ఇక కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో తెలుగు రాష్ట్రాలకు పెద్ద ప్రయోజనం కలిగే కేటాయింపులేవి జరపలేదు. దీనిపై ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైకాపా ప్రభుత్వం బడ్జెట్‌పై తీవ్రంగానే స్పందిస్తూ.. కేంద్రంపై విమర్శలు గుప్పిస్తోంది. వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి స్పందిస్తూ.. ఇది ముమ్మాటికి ఎన్నికల బడ్జెట్టే.. ఏపీపై కేంద్రానిది సమతి తల్లీ ప్రేమ… రాష్ట్రానికి ఇదొక శరాఘాతం అంటూ ఘాటుగానే స్పందించారు.
అయితే, టీఆర్ ఎస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మాత్రం బడ్జెట్‌పై పెద్దగా స్పందించడం లేదు. బీజేపీ పై తీవ్రంగా విమర్శలు గుప్పించే టీఆర్ ఎస్ లీడర్లు.. రాష్ట్రానికి పెద్దగా కేటాయింపులు లేకపోయినప్పటికీ ఎందుకు నోరు మెదపటం లేదు? తెలంగాణ సర్కారు ఎందుకు బడ్జెట్‌పై మౌనంగా ఉంది? రాష్ట్ర అధికార పార్టీ నేతలు అటు ఢిల్లీలో ఇటు తెలంగాణ గల్లీలలో ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు? అసలు గులాబి – కమళం మధ్య రహస్య దోస్తాన్ ఏంటీ? అనే ప్రశ్నలు రావడం షరా మాములే..!
సీఎం కేసీఆర్ కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ప్రత్యేక సమావేశాలు, నేతలతో చర్చలు జరిపి.. దానిపై వారి స్పందనను తెలిపేవారు. గత బడ్జెట్ సమీక్ష సందర్బంగా కూడా కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. ప్రస్తుతం పెద్దగా కేటాయింపులు లేకపోయిన ఆయన సైలెంట్‌గా ఉండటంతో రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీసింది. అసలు కమళం, గులాబిలా దోస్తాన్ పైనే ఈ చర్చ జరుగుతోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా మౌనంగానే ఉన్నారు. తాజాగా తెలిసిన విషయమేంటంటే.. సీఏం కేసీఆర్ నుంచి ఆదేశాలు రకపోవడంతోనే బడ్జెట్‌పై టీఆర్ ఎస్ నేతలు స్పందించలేదని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఇటీవల సీఎం ఢిల్లీ పర్యటన అనంతరం నుంచి అధికార పార్టీలో ముందుకు సాగే విషయంలో మార్పులు వచ్చినట్టు.. బీజేపీ రహస్య ఒప్పందం గురించి గుసగుసలు వినిపించాయి. దీనిన అనుగుణంగా కేంద్ర సాగు చట్టాలపై టీఆర్ ఎస్ నోరు మెదపకుండా మారిపోయింది.
అలాగే, పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అన్ని ప్రతిపక్ష పార్టీలు ఒకేతాటిపై ఉండి రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించినా.. టీఆర్ ఎస్ ఎంపీలు మాత్రం హజరయ్యారు. ఇదంతా కూడా కేసీఆర్ సరికొత్త వ్యూహమని పలువురు విశ్లేషకులు భావిస్తుండగా.. మరికొందరు మాత్రం కేంద్రంతో దోస్తాన్ కోసమే అని పేర్కొంటున్నారు. రాష్ట్రంలో బీజేపీని మట్టికరిపించాలనే సరికొత్త వ్యూహంలోని భాగంగానే ఇది జరుగుతున్నదని కూడా అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ.. కేంద్ర బీజేపీ- రాష్ట్ర టీఆర్ ఎస్ బంధం ఎంటో తెలియాలంటే మరికొంత కాలం వేచిచూడాల్సిందే..!