రాష్ట్రంలో రాగల మూడ్రోజులు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ తూర్పు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇదే సమయంలో గంటకు 30నుంచి 40కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. రానున్న మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
మరోవైపు కొద్ది రోజుల క్రితం కురిసిన అకాల వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా రైతులకు నష్టాన్ని మిగిల్చాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో నీటిపాలైంది. వడగళ్లు, ఈదురు గాలులు కర్షకులను కోలుకోలేని దెబ్బతీశాయి. ఒక్కసారిగా విరుచుకుపడ్డ వానలు.. చేతికందాల్సిన పంటను నేలపాలు చేసి.. అన్నదాతపై అదనపు భారాన్ని కలిగించాయి. వేల ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న, మిర్చి, మామిడి, బొప్పాయి, అరటి తోటలకు కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని కర్షకులు ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ వర్షాలు కురిసే అవకాశముందన్న వార్తలతో రైతు గుండె మరోసారి భయంతో కంపిస్తోంది.