పౌరసరఫరాలశాఖ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆ శాఖ రూ.56 వేల కోట్ల అప్పుల్లో ఉందని వెల్లడించారు. గత పాలకుల వల్ల పౌర సరఫరాల శాఖలో అనేక తప్పిదాలు జరిగాయని ఆరోపించారు. 12 శాతం మంది రేషన్ బియ్యం తీసుకోవడం లేదని చెప్పారు. పేదలకు నాణ్యమైన రేషన్ బియ్యం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో పౌరసరఫరాలశాఖపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. యాసంగి, వర్షాకాలంలో ధాన్యం ఉత్పత్తిపై అధికారులతో ఉత్తమ్ చర్చించినట్లు చెప్పారు. మిల్లింగ్ సామర్థ్యం, బియ్యం నాణ్యతపై అధికారులు వివరించినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై ఆరా తీసినట్లు వెల్లడించారు. రేషన్ బియ్యాన్ని కొందరు పక్కదారి పట్టిస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. కొత్త రేషన్ కార్డు దరఖాస్తులపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. మిల్లర్ల సమస్యలపైనా అధికారులతో చర్చించామన్న మంత్రి.. గ్యాస్ సిలిండర్ హామీని వంద రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చారు.