నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా మోతే శివారులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లాలో ఎన్నో మహిమ గల ఆలయాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయని అన్నారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి 100 కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్.
త్వరలోనే తాను స్వయంగా వచ్చి ఆగమ శాస్త్ర ప్రకారం భారతదేశంలో సుప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని నిర్మాణం చేయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి గొప్ప మహిమగల స్వామి అని అన్నారు. జగిత్యాలలో జిల్లాగా ఏర్పాటు చేసుకోవడమే కాక ఇవాళ ఒక అద్భుతమైన కలెక్టరేట్ భవనాన్ని నిర్మించుకున్నామన్నారు. ఉద్యమం సందర్భంలో అత్యంత మహిమాన్వితమైన ధర్మపురి నరసింహ స్వామి ఆలయానికి వచ్చానని గుర్తు చేసుకున్నారు.