ఎగువ ప్రాంతాల్లో కరుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి.
ముఖ్యంగా తెలంగాణకు వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 1,64,922 క్యూసెక్కుల వరద వస్తున్నదని ప్రాజెక్టు డీఈ జగదీశ్ ఆదివారం తెలిపారు. ఈ వానకాలం సీజన్‌లో ఇప్పటి వరకు ప్రాజెక్టులోకి 222 టీఎంసీల వరద వచ్చి చేరిందని చెప్పారు. ఆదివారం ఉదయం వరకు 113.29 టీఎంసీల నీటిని గోదావరి నదిలోకి వదిలివేశామని పేర్కొన్నారు. ఇన్‌ఫ్లో భారీగా పెరగడంతో ఆదివారం ఉదయం ప్రాజెక్టు 40 గేట్లను ఎత్తి లక్షా 50 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలామని తెలిపారు.
ప్రాజెక్టులో ఆదివారం సాయంత్రం వరకు 88.11 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 7,878 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నదని, దీంతో ప్రాజెక్టు నీటి నిల్వలు 7.33 టీఎంపీలకు చేరుకున్నాయని ప్రాజెక్టు డీఈఈ దత్తాత్రి తెలిపారు. మరోపక్క బోధన్ మండలంలోని సాలూ ర వద్ద మంజీరానది పాత వంతెనను తాకుతూ ఉధృతంగా ప్రవహిస్తున్నది. రెంజల్ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి నదిలో ఉన్న పురాతన శివాలయం పూర్తిగా నీటిలో మునిగింది. జాలర్లు చేపల వేటకు వెళ్లకుండా, భక్తులు నీటిలోకి దిగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.