తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. టార్గెట్ 17 పెట్టుకుని లోక్ సభ ఎన్నికల్లో పనిచేయాలని.. తెలంగాణ రాష్ట్రంలో 12కు తగ్గకుండా లోక్ సభ స్థానాలు గెలిపించుకోవాలన్నారు. ఈ నెల 8న 5జిల్లాలు, 9న 5 జిల్లాల నేతలతో సమీక్షిస్తానన్నారు. ఈ నెల 10 నుంచి 12 వరకు 17 పార్లమెంట్ ఇంఛార్జ్ లతో సన్నాహక సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. 20 తరువాత క్షేత్ర స్థాయి పర్యటనల్లో పాల్గొంటానని పేర్కొన్నారు.
నిన్న జరిగిన కాంగ్రెస్ సమావేశంలో మూడు తీర్మానాలు ప్రతిపాదించారు సీఎం రేవంత్ రెడ్డి. ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ గారికి అభినందనలు తెలుపుతూ తీర్మానించారు. తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎంతో సమన్వయంతో పనిచేసిన మాణిక్ రావు ఠాక్రే అభినందిస్తూ రెండవ తీర్మానం చేశారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి సోనియా గాంధీ గారు పోటీ చేయాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతుందన్నారు. వీలైనంత త్వరగా పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి.. వారికి సముచిత స్థానం కల్పిం చే బాధ్యత మాదని చెప్పారు.