తెలంగాణ యూనివర్సిటీలో కరోనా కలకలం.. 14 మందికి పాజిటివ్

-

రాష్ట్రంలో కరోనా మరోసారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా విద్యార్థులపై కొవిడ్ తన పంజా విసురుతోంది. ఇటీవలే గురుకుల విద్యార్థులు కరోనా బారిన పడగా.. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీలో 14 మంది విద్యార్థులకు కరోనా సోకింది.

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ సభకు వెళ్లి వచ్చిన విద్యార్థులు సోమవారం అస్వస్థతకు గురయ్యారు. వర్సిటీ ఉన్నతాధికారుల ఆదేశాలతో మంగళవారం స్థానిక పీహెచ్‌సీలో సుమారు 200 మందికి పైగా విద్యార్థులకు కరోనా ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించారు. ఏడుగురు బాలికలు, ఏడుగురు బాలురకు పాజిటివ్‌గా తేలినట్లు వసతిగృహాల చీఫ్‌ వార్డెన్‌ అబ్దుల్‌ ఖవి తెలిపారు. బుధవారం జరగాల్సిన ఇంటర్నల్‌ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

జిల్లాలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నా.. అందరికి స్వల్ప లక్షణాలే ఉన్నాయని నిజామాబాద్ జిల్లా వైద్యశాఖ వెల్లడించింది. ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. గుంపులుగా ఉండకుండా జాగ్రత్త వహించాలని చెప్పింది. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version