పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో అరెస్టయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు ఊరట లభించింది. సంజయ్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ హనుమకొండ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా కారాగారంలో ఉన్న బండి సంజయ్ ఇవాళ విడుదల కానున్నారు.
ఇప్పటికే కరీంనగర్ జైలుకు బండి సంజయ్ బెయిల్ పత్రాలు చేరుకున్నారు. బీజేపీ నేత ప్రవీణ్ రావు జైలు అధికారులకు బెయిల్ పత్రాలు అందించారు. కాసేపట్లో కారాగారం నుంచి బండి సంజయ్ బయటకు రానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగ అప్రమత్తమైంది. కారాగానికి మూడు కిలోమీటర్ల మేర రహదారులను పోలీసులు బ్లాక్ చేశారు.
జైలుకు వెళ్లే అన్ని మార్గాలను బారికేడ్లతో మూసివేశారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జిల్లా కేంద్రంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో నగరంలోని దుకాణాలు మూసివేశారు. మరోవైపు జైలు వద్దకు బీజేపీ కార్యకర్తలు, మీడియా రాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.