రాష్ట్రంలో గురువారం రోజున పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన వానకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల పిడుగు పడి ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఎగువ కురిసిన వర్షానికి వస్తున్న వరదతో చాలా చోట్ల వాగులు ఉప్పొంగి పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో పలుచోట్ల ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. మరోవైపు ఓచోట మేతకు వెళ్లిన 190 పశువులు ఇంటికి తిరిగొచ్చే క్రమంలో వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని సంతాయిపేటకు చెందిన పశువులను ఇద్దరు వ్యక్తులు గురువారం రోజున గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో మేతకు తీసుకెళ్లారు. సాయంత్రం తిరిగి తీసుకెళ్లేందుకు భీమేశ్వరవాగు దాటిస్తుండగా ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరిగింది. వరద ప్రవాహం ఉవ్వెత్తున రావడంతో ఒడ్డుకు చేరలేక జీవాలన్నీ వరదలో కొట్టుకుపోయాయి. కొంత దూరం తరువాత 20 పశువులు గాయాలతో బయటపడ్డాయి.
విషయం తెలుసుకున్న గ్రామస్థులంతా వాగు వద్దకు చేరి సహాయక చర్యలు చేపట్టారు. పశువుల కోసం గాలించగా.. రాత్రి పది గంటల వరకు మరో 80 పశువులను రక్షించారు. మిగతా వాటి కోసం తాడ్వాయి పోలీసులు, కామారెడ్డి అగ్నిమాపక సిబ్బంది గాలింపు కొనసాగిస్తున్నారు. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో ఒక్కసారిగా వరద వచ్చినట్లు గ్రామస్థులు తెలిపారు.