హైదరాబాద్లో కుక్కల దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన పదేళ్లలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 3,36,767 మందిని కుక్క కరిచిన కేసులు ఐపీఎం(ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్)లో నమోదయ్యాయి. అందులోని కొన్నికేసులు పిల్లులు, కోతులు కరిచినవి కూడా ఉన్నాయని జీహెచ్‌ఎంసీ తెలిపింది. వీధి కుక్కల నియంత్రణకు జీహెచ్‌ఎంసీ తీసుకుంటున్న చర్యలు నామమాత్రం అనే విమర్శలొస్తున్నాయి.
నగరంలో సుమారు 6లక్షల శునకాలుండగా.. వీధి కుక్కల నియంత్రణకు బల్దియా పశు వైద్య విభాగం ఏటా రూ.10కోట్లు వెచ్చిస్తోంది. మొత్తం ఐదు జంతు సంరక్షణ కేంద్రాల్లో రోజూ సుమారు 400 శునకాలకు పిల్లలు పుట్టకుండా ఏబీసీ శస్త్రచికిత్సలు చేస్తున్నామని, తద్వారా సంతతిని కట్టడి చేస్తున్నామని అంటున్నారు. కానీ పరిస్థితులు అధికారులు చెబుతున్న దానికి విరుద్ధంగా ఉన్నాయి. ఏ వీధిలో చూసినా ఐదు నుంచి పది కుక్కలు కనిపిస్తున్నాయి. బడికెళ్లే పిల్లలపై, పాదచారులు, వృద్ధులు, మహిళలపై దాడులకు తెగబడుతున్నాయి. మరోవైపు రేబిస్ వైరస్ సోకిన వీధికుక్కల దాడికి గురైన వ్యక్తుల్లో పదేళ్ల కాలంలో 8 మంది చనిపోయినట్లు ఐపీఎం గణాంకాలు చెబుతున్నాయి.