తెలంగాణలో శాసనసభ ఎన్నికల్లో భాగంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ తనిఖీల్లో భారీగా బంగారం, నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు పట్టుబడుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మరుక్షణం నుంచి చేపట్టిని తనిఖీల్లో ఇప్పటి వరకు దాదాపు రూ.500 కోట్ల సొత్తు సీజ్ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి వికాస్ రాజ్ తెలిపారు.
ఇప్పటివరకు 498 కోట్ల 98 లక్షలకి పైగావిలువైన నగదు, మద్యం, ఆభరణాలు, కానుకలు స్వాధీనం చేసుకున్నట్లు వికాస్ రాజ్ వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో 8 కోట్ల 38 లక్షల రూపాయలకు పైగా మెుత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అక్టోబర్ 9 నుంచి ఇప్పటివరకు 178.48 కోట్ల నగదు పట్టుకున్నట్లు తెలిపారు. 62.93 కోట్ల విలువైన మద్యం, 28.95 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.178.09 కోట్ల విలువైన బంగారు, వెండి,వజ్రాలు, ఆభరణాలు పట్టుబడినట్లు తెలిపారు. వాటితో పాటు 54.52 కోట్ల విలువైన ఇతర కానుకలు, వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వికాస్ రాజ్ వెల్లడించారు.