హైదరాబాద్ నగరంలో సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో నాలాలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో కూకట్ పల్లి ప్రగతినగర్ లో విషాద ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్లితే.. ప్రగతినగర్ ఎన్ఆర్ఐ కాలనీ వద్ద ఆడుకునేందుకు బయటికి వచ్చిన నాలుగేళ్ల బాలుడు మిథున్ నాలాలో పడి గల్లంతయ్యాడు. ఈ క్రమంలో నిజాంపేట రాజీవ్ గృహకల్ప వద్ద బాలుడి మృతదేహం కనిపించింది. దీంతో మిథున్ ని బయటికి తీసే ప్రయత్నం విఫలం కావడంతో అక్కడే ఉన్న తుర్క చెరువులోకి కొట్టుకుపోయింది మృతదేహం. తుర్క చెరువు వద్దకు చేరుకున్న తరువాత పోలీసులు, డీఆర్ఎఫ్ బృందాలు బాలుడి మృతదేహాన్ని బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. జంటనగరాల్లో భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు అన్ని జలమయం అయ్యాయి. రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇళ్లలోకి వరదనీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. మేడ్చల్ వద్ద అపార్టుమెంట్ల వద్ద భారీగా వర్షపు నీరు చేరడంతో వారిని జేసీబీల సహాయంతో బయటికి తీసుకొస్తున్నారు.