G-20 డిన్నర్‌కు రాష్ట్రపతి భవన్ పంపిన ఆహ్వాన పత్రంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్ధానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొనడంపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రతి విషయంలో సమస్యలు కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. దేశం ఇప్పటికీ, ఎన్నటికీ భారత్‌గానే ఉంటుందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ నేతలకు తానేమీ చెప్పదలుచుకోలేదని, తాను భారత్ వాసినని, తన దేశం పేరు భారత్ అని ఎప్పటికీ భారత్‌గానే ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఇబ్బంది ఉంటే దానికి ఆ పార్టీ చికిత్స తీసుకోవాలని హితవు పలికారు. మరోవైపు ఇండియా ఇక భారత్‌గా మారనుందనే ప్రచారం సాగుతోంది. సెప్టెంబర్ 18 నుంచి ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో నరేంద్ర మోడీ సర్కార్ ఈ ప్రతిపాదనను సభ్యుల ముందుంచనుందని భావిస్తున్నారు.
రాజ్యాంగ సవరణ ద్వారా ఇండియా పేరును భారత్‌గా మార్చే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం చేపడుతుందని, ఇండియా పేరు మార్చుతూ సభలో తాజా తీర్మాణం ఆమోదించేందుకు మోడీ సర్కార్ పావులు కదుపుతోందని సమాచారం. రాష్ట్రపతి భవన్ నుంచి G-20 ప్రతినిధులకు అధికారిక సమాచారంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్ధానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాసిఉండటం పేరు మార్పు ప్రతిపాదనకు బలం చేకూరుస్తోంది.