వైద్యం కోసం వచ్చిన రోగికి షాకింగ్‌ అనుభవం..!

-

వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లిన ఓ రోగికి షాకింగ్‌ అనుభవం ఎదురైంది. ప్రమాదవశాత్తూ అక్కడ లిఫ్ట్‌ లో ఇరుక్కుపోయి.. రెండు రోజుల అనంతరం ప్రాణాలతో బయటకు వచ్చాడు. ఈ ఘటన కేరళ  రాజధాని తిరువనంతపురంలో చోటు చేసుకుంది. ఉళ్లూరు ప్రాంతానికి చెందిన 59 ఏళ్ల రవీంద్రన్‌ నాయర్‌ తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం వైద్య పరీక్షల కోసం తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఆసుపత్రికి వెళ్లాడు. ఓపీ బ్లాక్‌లోని మొదటి అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్‌ ఎక్కాడు. అయితే అదే సమయంలో ఎలివేటర్‌లో సమస్య తలెత్తి ఆగిపోయింది. దీంతో రవీంద్రన్‌ అందులోనే ఇరుక్కుపోయాడు. అలారం ఎన్ని సార్లు నొక్కినా ప్రయోజనం లేదు.

లిఫ్ట్‌ బలంగా ఊగడం వల్ల రవీంద్రన్‌ ఫోన్‌ కూడా కిందపడి పగిలిపోయింది. దీంతో తాను లిఫ్ట్‌లో చిక్కుకుపోయినట్లు ఎవరికీ చెప్పే అవకాశం లేకుండాపోయింది. దీంతో అప్పటి నుంచి అతడు లిఫ్ట్‌లోనే ఇరుక్కుపోయాడు. రవీంద్రన్‌ ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక సోమవారం  లిఫ్ట్‌ ఆపరేటర్‌ రొటీన్‌ వర్క్‌ కోసం ఆసుపత్రికి వచ్చారు. అప్పుడు అది పనిచేయడం లేదని గుర్తించి రిపేర్‌ చేసి లిఫ్ట్‌ డోర్‌ తెరవగా.. అందులో రవీంద్రన్‌ స్ప్రహతప్పి కన్పించాడు. దీంతో అతడికి వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version