తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖల విద్యుత్ బకాయిలు ఎందుకు చెల్లించట్లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను కాంగ్రెస్ కొనసాగిస్తోందని.. విమర్శించారు. పాతబస్తీ కి సంబంధించి నష్టాలు వస్తున్నట్లు పదేపదే చెబుతున్నారు కాని, విద్యుత్ కొనుగోళ్ల ధరలపై ఎవరూ ప్రశ్నించట్లేదు ఎందుకని నిలదీశారు. గతంలో కంటే విద్యుత్ ధరలను పెంచి కొనుగోళ్లు జరుగుతూనే ఉన్నాయని, ఇది మాత్రం ఎవరికీ ఎందుకు కనిపించడం లేదని ఆరోపించారు.
ఇబ్రహీంబాగ్ హైటెన్షన్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ఐదెకరాలు కావాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేదని తెలిపారు. రాష్ట్రంలో నేరాల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉందని, ఎవరు
నేరస్థులు, ఎవరు కాదనేది పోలీసులకు పూర్తిగా తెలుసని.. కాని భూవివాదాల పరిష్కారంలోనే పోలీస్ స్టేషన్లు తలమునకలయ్యాయని తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీస్ స్టేషన్లు భూవివాదాల పరిష్కారం లో ఉండడం వల్లే నేరాలు పెరుగుతున్నాయని, ఇకనైనా పోలీసులు ఆ పంచాయితీలు పక్కన పెట్టి శాంతిభద్రతల పరిరక్షణ చేపట్టేలా చూడాలని అక్బరుద్దీన్ కోరారు.