ఏప్రిల్ 14 న అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణ కానుంది. ఈ విషయాన్ని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇక అంబేడ్కర్ విగ్రహం పనులను ఇవాళ సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సుదీర్ఘంగా సాగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునే వారికి గృహ లక్ష్మి పథకం అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
నియోజకవర్గానికి 3,000 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని నిర్ణయించింది. రూ.3 లక్షల గ్రాంటుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో 3 విడతల్లో జమ చేయనున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఇక ఇటు ఇవాళ బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షం, కార్యవర్గ సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కార్యవర్గ సభ్యులతోపాటు జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, డీసీఎంఎస్, డీసీసీబీ ఛైర్మన్లు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.