తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5.30 గంటల తర్వతా ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. బీఆర్ఎస్ రెండో స్థానం,, బీజేపీ మూడో స్థానంతో సరిపెట్టుకుంటాయని తెలిపాయి. అయితే రాష్ట్ర ఎన్నికల పోలింగ్ సరళిపై బీజేపీ హైకమాండ్ తాజాగా ఆరా తీసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఫోన్ చేసి.. ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
గత ఎన్నికలతో పోలిస్తే, ఓట్లు, సీట్ల శాతం పరంగా మెరుగైన ఫలితాలు వస్తాయని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ధీమాతో ఉంది. ఆదివారం వెల్లడయ్యే ఫలితాల్లో సత్తా చాటుతామని… ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తోంది. బీజేపీకి గరిష్ఠంగా 5 నుంచి 10 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన విషయం తెలిసిందే. అయితే ఎగ్జిట్ పోల్స్‌ను తాము పరిగణనలోకి తీసుకోవడం లేదని బీజేపీ వర్గాలు స్పష్టం చేశాయి.